ఆది శంకరాచార్యులు రచించిన స్తోత్రములలో మీనాక్షి దేవి గణకీర్తి ని స్తుతిస్తూ వ్రాసిన మీనాక్షి పంచరత్నం ఓ కలికితురాయి.
చక్కటి పదాలతో కూర్చిన అయిదు చరణములతో సాగుతుంది ఈ మీనాక్షి పంచరత్నం. ఒక్కొక్క చరణాన్ని ఒక్కొక్క రత్నంగా భావిస్తూ దేవికి అర్పించటమే ఈ పంచరత్న స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశము.
మదురైలో కొలువై ఉన్న మీనాక్షి, సోమసుందరుల వైభవాన్ని,దైవత్వమును, కరుణాసాగరి అగు ఆ దేవి యొక్క దివ్య రూపాన్ని కీర్తిస్తూ సాగుతుంది ఈ మీనాక్షి పంచకం.
అంతే కాక శ్రీ చక్ర బిందువు నందు నివసించు ఆ దేవిని జ్ఞానమూర్తిగా, సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వరుల యొక్క తల్లిగా, మహాదేవుని యొక్క భార్యగా కొనియాడబడింది.
చదివినా విన్నా కరుణతో వచ్చి కష్టాలను కడతేర్చే ఆ మీనాక్షి దేవి కృపకు పాత్రులు అవుదాం. మీనాక్షి పంచరత్నం స్తోత్రమును నిత్యం పటిద్దాం.
Meenakshi Pancharatnam Telugu – Meenakshi Panchakam – మీనాక్షి పంచరత్నం తెలుగులో
ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్జ్వలాం
బింబోష్టిం స్మిత దంత పంక్తి రుచిరాం పీతాంబరా-లంకృతామ్
విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవితపదా తత్త్వ స్వ రూపాం శివాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిమ్ (1)
ఉదయిస్తున్న వేలకోట్ల సూర్యుల కాంతికి సరిసమానమైన కాంతి కలిగిఉండి, కంకణముల మరియు హారముల కాంతిచే ప్రకాశించుచూ,
దొండపండు వంటి పెదవులు, చిరునవ్వుతో మెరిసే అందమైన దంతవరుస కలిగి, పీతాంబరములచే శోభాయమానముగా వెలుగొందుచూ
విష్ణు, బ్రహ్మ, ఇంద్రులచే సేవింపబడిన పాద పద్మములు కలదై, తత్వ స్వరూపిణియై, శివునికి సంబంధించినదానిగా, మంగళకారినిగా
కరుణాసముద్రురాలగు మీనాక్షి దేవికి నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.
ముక్తాహార లసిత్ కిరీట రుచిరాం పూర్ణేందు వక్త్ర ప్రభాం
శింజన్నూ పుర కింకిణీ మణిధరాం పద్మ ప్రభా భాసురామ్
సర్వాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీ రమా సేవితా
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిమ్ (2)
ముత్యాల హారాలతో అలంకరించబడిన కిరీటముతో విరాజిల్లుచూ, పున్నమి చంద్రుని వంటి ప్రకాశవంతమైన ముఖకాంతి కలిగి
చిరు ధ్వనులు చేయు అందెలను, మణుల పొదిగిన ఆభరణాలనములను ధరించి, వికసించిన పద్మముల వంటి సౌందర్యముతో ప్రకాశించుచూ
కోరిన కోరికలను తీర్చు కొంగుబంగారమై, పర్వత రాజు పుత్రికగా (పార్వతీ దేవిగా), సరస్వతి, లక్ష్మిదేవిచే సేవించబడుచున్న
కరుణాసముద్రురాలగు మీనాక్షి దేవికి నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.
శ్రీ విద్యాం శివవామభాగ నిలయాం హ్రీంకార మంత్రోజ్జ్వలాం
శ్రీ చక్రాంకిత బిందు మధ్య వసతిం శ్రీమత్ సభాా నాయకీమ్
శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీమత్ జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిమ్ (3)
శ్రీ విద్యా సరూపిణిగా, శివుని ఎడమ భాగము నందు నివసించు దేవిగా, హ్రీంకారమంత్రముచే ప్రకాశించుచూ
శ్రీ చక్రము మధ్యన ఉండు బిందువు నందు నివసించు ఓ దేవి, గొప్పవారి సభకు నాయకురాలిగా
షణ్ముఖుడు, విఘ్నేశ్వరులకు తల్లిగా, జగత్తుని తన అదుపాజ్ఞలలో పాలించుచూ
కరుణాసముద్రురాలగు మీనాక్షి దేవికి నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.
శ్రీమత్ సుందర నాయకీం భయహరాం జ్ఞాన ప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసన అర్చితపదాం నారాయణ స్యానుజామ్
వీణా వేణు మృదంగ వాద్య రసికాం నానా విధాడంబికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిమ్ (4)
సుందరేశ్వరునికి (శివునికి) భార్యగా, భయమును పోగొట్టు దేవిగా, జ్ఞాన ప్రదాయినిగా, నిర్మలముగా ఉండుచూ
నల్లని కాంతి కలిగి, కమలము నందు ఆసీనుడైనవానిచే (బ్రహ్మ దేవునిచే) అర్చింపబడు పాదములు కలిగి, నారాయణుని చెల్లెలిగా
వీణ, వేణు, మృదంగ వాద్యములనందు ఆసక్తి కలిగి, అనేక విధములైన ఆడంబరములు కలిగిఉన్న
కరుణాసముద్రురాలగు మీనాక్షి దేవికి నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.
నానాయోగి మునీంద్ర హృన్ని వసతిం నానార్ధ సిద్ధిప్రదాం
నానాపుష్ప విరజితాంఘ్రి యుగళాం నారాయణే-నార్చితామ
నాద బ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థ తత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్య వారాం నిధిమ్ (5)
యందరో యోగులు, మునీంద్రుల హృదయములనందు నివసించుచూ అనేకానేక సిద్ధులను ప్రసాదించుచూ
అనేక రకములగు పుష్పములతో విరాజిల్లు పాదద్వయం కలిగి, నారాయణునిచే పూజింపబడుచూ
నాదబ్రహ్మ రూపిణియై, పరమైయున్నదానికంటే పరమై, సకల తత్వములు తానేయైఉన్న కరుణాసముద్రురాలగు మీనాక్షి దేవికి నేను ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను.
ఇతి శ్రీ మీనాక్షి పంచరత్నం సంపూర్ణం
Leave a Comment