Chalisa చాలీసా Stotras on Goddess Lalitha లలితా దేవి స్తోత్రాలు

Lalitha Chalisa in Telugu లలితా చాలీసా (తెలుగు)

లలితా దేవి ఆరాధనా స్తోత్రాలలో లలితా చాలీసా చాలా ప్రత్యేకమైనది. ఆ తల్లి యొక్క గొప్పతన్నాని పరిపరి విధాలుగా కీర్తిస్తూ సాగే ఓ దివ్యమైన ఆరాధనే ఈ లలితా చాలీసా.

దేవి యొక్క అనేక స్వరూపాలని, వాటి రూపములను, ఆ రూపాలలో మానవాళికి చేసిన సేవలను, భక్తుల పట్ల చూపించు కరుణను వివరిస్తూ సాగుతుంది ఈ చాలీసా.

సకల శుభాల కొరకు, కష్టాల నుండి బయటపడటానికి, సిరి సంపదలతో తులతూగేందుకు, దేవి అనుగ్రహం కొరకు భక్తులు ఎల్లవేళలా పఠించతగ్గది ఈ లలితా చాలీసా. భక్తితో పారాయణ చేసి దేవి కృపకు పాత్రులుకండి.

Goddess as described in Lalitha Chalisa in telugu

Sri Lalitha Chalisa in Telugu – లలితా చాలీసా

లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం (1)

హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం (2)

పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంస వాహనారూపిణిగా వేదమాతవై వచ్చితివి (3)

శ్వేత వస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి (4)

నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాద్ ఆ పరమేశ్వరుడు (5)

కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు (6)

శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగ రావమ్మా (7)

మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి (8)

పసిడి వెన్నెలా కాంతులలో పట్టువస్త్రపు ధారణలో
పారిజాత పూమాలలో పార్వతి దేవిగా వచ్చితివి (9)

రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దిని-వైనావు (10)

కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి (11)

రామలింగేశ్వరుని రాణివిగా రవికుల సోముని రమణివిగ
రమా వాణి సేవితగా రాజరాజేశ్వరి-వైనావు (12)

ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రం చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా (13)

మహామంత్రాధి దేవతగా లలితా త్రిపురసుందరిగా
దారిద్య బాధలు తొలిగించి మహదానందము కలిగించే (14)

అర్తత్రాణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మా (15)

విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి (16)

ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ (17)

దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ (18)

శంఖు చక్రములు ధరియించి రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు (19)

పరాభట్టారిక దేవతగా పరమ శాంత స్వరూపిణిగ
చిరునవ్వులను చిందిస్తూ చెరకుగడను ధరయించితివి (20)

పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథ గణములు కొలువుండ కైలాసంబే పులకించే (21)

సురులు అసురులు అందరునూ శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి (22)

మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ (23)

సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహ వాహినిగా వచ్చితివి (24)

మహామేరువు నిలయనివి మందార-కుసుమ మాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్ష మార్గము చూపితివి (25)

చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే (26)

అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం (27)

అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా (28)

నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు (29)

రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప
అభయ హస్తము చూపితివి అవతారములు దాల్చితివి (30)

అరుణారుణపు కాంతులలో అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి (31)

గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి (32)

పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి (33)

కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా (34)

ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృ హృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు (35)

మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి (36)

త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయ కారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా (37)

ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదాము (38)

సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు (39)

మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము (40)

ఇతి శ్రీ లలితా చాలీసా సంపూర్ణం

About the author

Stotra Manjari Team

Leave a Comment