పరమ శివుణ్ణి స్తుతించు స్తోత్రాలలో శివ పంచాక్షర స్తోత్రం చాలా ప్రత్యెకైమైనది. నమః శివాయ అను పంచాక్షరీ మంత్రం యొక్క ప్రాముఖ్యతను ఈ స్తోత్రం తెలియచేస్తుంది. శంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రం పరమ శివుని యొక్క గొప్పతన్నాని మరియు స్వరూపాన్ని తెలియచేస్తుంది.
జనులు ఎల్లవేళలా స్తుతించతగ్గ గొప్ప స్తోత్రం ఈ శివ పంచాక్షర స్తోత్రం.
Shiva Panchakshara stotram Lyrics in Telugu with Meaning – శ్రీ శివ పంచాక్షర స్తోత్రం
నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై న-కారాయ నమః శివాయ (1)
సర్ప రాజములను హారములుగా ధరించువాడు, మూడు కన్నులు కలవాడు
శరీరమంతయు భస్మమును పూసుకొనినవాడు, మహేశ్వరునిగా వెలుగొందువాడు
నిత్యము ఉండువాడు (జనన మరణాదులు లేనివాడు), స్వచ్ఛముగా ఉండువాడు, దిక్కులే వస్త్రముగా కలవాడు
న కార స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారము.
మందాకిని సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాధ మహేశ్వరాయ
మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ
తస్మై మ-కారాయ నమః శివాయ (2)
మందాకినీ నది (ఆకాశ గంగా) యొక్క జలముచే చేయబడిన గంధము పూయబడినవాడు
నందీశ్వరుడు, ఇతర ప్రమధగణ నాయకులకు నాధునిగాను
మందార పుష్పములు, ఇతర పుష్పములతోను పూజింపబడువాడగు
మ కార స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారము.
శివాయ గౌరీ వాదనాబ్జ బృంద
సూర్యాయ దక్షా-ద్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై శి-కారాయ నమః శివాయ (3)
గౌరీ దేవి ముఖ పద్మమును సూర్యునిగా వికసింపచేయువాడు, మంగళకరుడు
దక్షుని నిరీశ్వర యజ్ఞమును నాశనము చేసినవాడు
నీలకంఠుడు (హాలాహల పానముచే నల్లనగు కంఠము కలవాడు), ధ్వజము (జండా) నందు వృషభ చిహ్నము గలవాడు
శి కార స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారము.
వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై వ-కారాయ నమః శివాయ (4)
వశిష్ఠుడు, కుంభోద్భవుడు (కుంభము యందు ఉద్భవించినవాడు, అగస్త్యుడు), గౌతముడు మరియు ఆర్యులచే పూజింపబడువాడు
మునీంద్రులు, దేవతలచే అర్చించబడుచున్న శేఖరుడు (జఠాజూటము పై చంద్రుడు కలవాడు)
చంద్రుడు, అర్కుడు (సూర్యుడు), వైశ్వనరుడు (అగ్ని) ని మూడు కన్నులుగా కలవాడు
వ కార స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారము.
యక్ష స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై యకారాయ నమః శివాయ (5)
యక్ష స్వరూపమును ధరించినవాడు, జఠాజూటము కలవాడు
పినాకము అనబడు విల్లును హస్తము నందు ధరించినవాడు, సనాతనుడు
దివ్య రూపమున ప్రకాశించు దేవుడు, దిగంబరుడు
య కార స్వరూపుడు అగు ఆ శివునకు నా నమస్కారము.
పంచాక్షర మిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే
పవిత్రమైన ఈ పంచాక్షర స్తోత్రంని ఎవరైతే శివ సన్నిధి నందు భక్తితో పఠిస్తారో, వారు శివ లోకమును పొంది, శివుని వద్ద ఉందుదురు.
ఇతి శ్రీ శంకరాచార్యకృత శ్రీ శివ పంచాక్షర స్తోత్రం సంపూర్ణమ్
Leave a Comment