భగవంతుని ఆరాధనలో సూక్త పరాయణకు ఎంతో విశిష్టత ఉంది. అందులో దేవిని ఆరాధించు సూక్తులలో దుర్గా సూక్తం ఎంతో శక్తివంతమైనది.
ఈ దుర్గా సూక్తం అగ్నిని ముఖ్యముగా చేసుకొని చేసే ప్రార్థన. ఒకటి రెండు చోట్ల దుర్గా దేవిని గురించి ప్రస్తావన ఉంది కానీ ఎక్కువగా అగ్ని పూజగానే ఈ సూక్తం ఉంటుంది. కానీ ఇందులోని పరమార్థం ఏమిటంటే ఆ అగ్నినే దుర్గా దేవిగా భావించటం. దుర్గా దేవి యొక్క అనేక రూపాలలో అగ్నిదుర్గా రూపం కూడా ఒకటి.
దుర్గమ్మ యొక్క కృపకొరకు దేవి భక్తులు తప్పక చదవవలసినది ఈ సూక్తం. ఈ సూక్త ప్రార్థన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శక్తిని, సంపదను, క్షేమాన్ని ప్రసాదిస్తుంది ఈ సూక్తం. అంతేకాక జీవితంలో ఎదురైయ్యే ఆపదల నుండి, దుఃఖము నుండి, మనల్ని బయటపడేస్తుంది.
ఈ దుర్గా సూక్తం యజుర్వేద భాగమైన తైత్తరీయ అరణ్యకంలో సంకలనం చేయబడింది.
Durga Suktam Telugu – దుర్గా సూక్తం
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః
స నః పర్-షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః
జాతవేద అనబడు ఓ అగ్ని దేవా, మేము నీకు సోమాన్ని(సోమ రసాన్ని) తీసి సమర్పిస్తున్నాము, ఆ అగ్ని మా జీవితములో వచ్చు అడ్డంకులను కాల్చివేయుగాక
ఆ అగ్ని మమ్మును అన్ని ధుఃఖాల నుండి రక్షించునుగాక. ఎలాగైతే సముద్ర మార్గమున ప్రయాణించుటకు నావ ఉపయోగపడుచున్నదో అట్లే అగ్ని మమ్మల్ని మా తప్పిదాల నుండి కాపాడుగాక.
తామాగ్ని వర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగ్‍మ్ శరణ మహం ప్రపద్యే సుతరసి తరసే నమః
అగ్ని వర్ణము కలిగి ఉండి, తపస్సు ద్వారా జ్వలించుచూ, మహాదేవునికి చెందిన దానిగా (వైరోచనిగా), శక్తియై కర్మ దాని ప్రతిఫలముల యందు ఉండు
ఓ దుర్గా దేవి, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను ఈ దుఃఖ సాగరము నుండి తీరానికి చేర్చుము. దేవీ, నీకు నా ప్రణామములు
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంధ స్వస్తి భిరతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః
ఓ అగ్ని దేవా, నీవు కీర్తింప తగినవాడవు. సంతోషకర మార్గముల ద్వారా మమ్ము ఈ దుఃఖముల నుండి సుదూరముగా తీసుకువెళ్లుము.
మా ఊరు, దేశము, ప్రపంచము సుభిక్షంగా ఉండుగాక. నీవు మా పిల్లలకు మరియూ వారి పిల్లలకు సంతోషము చేకూర్చుగాక.
విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధున్న నావా దురితా తిపర్షి
అగ్నే అత్రి వన్మనసా గృణానో అస్మాకం బోధ్యవితా తనూనామ్
జాతవేద అనబడు ఓ అగ్ని, సముద్రములో పడి తల్లడిల్లే వ్యక్తిని పడవ కాపాడునట్లు, నీవు మా దుఃఖములను తొలగించి మమ్ము కాపాడు.
మా శరీరములు కాపాడు ఓ అగ్ని, ఇతరుల సంతోషమును ఎల్లప్పుడూ మనస్సు యందు ఆలోచించు అత్రి మహర్షివలె, నీవుకూడా మా శ్రేయస్సును, సంతోషమును మనస్సు నందు ఉంచుకో.
పృతనా జితగ్ం సహమానముగ్ర మగ్నిగ్ం హువేమ పరమాధ్స-ధస్ధాత్
స నః పర్-షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః
శత్రువులను నాశనం చేయువాడు, వారిని ముట్టడించేవాడూ, ఉగ్రుడు అయిన అగ్నిని సభ యొక్క అత్యున్నత స్థానం నుండి ఇక్కడకు రమ్మని ఆహ్వానిస్తున్నాను.
ఆ అగ్ని ఈ ప్రపంచములో పొంచిఉన్న ఆపదల నుండి మాకు రక్షణ కల్పించుగాక. భాధలు, తప్పిదముల నుండి మమ్ము కాపాడుము. ఆ అగ్ని మమ్ము ఈ బాధలకు దూరముగా తీసుకువెళ్ళుగాక.
ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచా అగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయ జస్వ
యాగాలలో కీర్తింపబడు అగ్నిదేవా, నువ్వు మా జీవితాలలో ఆనందాన్ని నింపుతున్నావు. యాగం చేయు హోతలో సనాతనుడిగా, కొత్తవానిగా ఉంటున్నావు.
నీ రూపంగా ఉంటున్న మాకు నీవు సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావాలి.
గోభిర్జుష్ట మయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతామ్
లెక్కపెట్టలేనన్ని పశువులు, దాని ద్వారా అనంత సంపద పొంది సంతోషమును అనుభవించుట కొరకు ఎల్లపుడు నీతోనే ఉంటాం. ఓ ఇంద్ర, భగవంతుడా, పాపం అంటని వాడా, సర్వమూ వ్యాపించి ఉండువాడా
దేవలోకంలో నివసించు వైష్ణవి దేవి ఇతర దేవతలపై మాకున్న భక్తి నిమిత్తం ఈ లోకములో నాకు సంతోషాన్ని ప్రసాదించుగాక.
ఓం కాత్యాయననాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్
మనము కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము, అందు నిమిత్తం కన్యాకుమారి దేవిని ధ్యానిద్దాం, ఆ దుర్గాదేవి మనకు ప్రచోదయం అవుగాక.
ఓం శాంతిః శాంతిః శాంతిః
Leave a Comment