దేవి స్త్రోత్రాలలో లలితా పంచరత్నం ఒక ప్రత్యేకమైన స్తోత్రం. లలితా దేవి యొక్క స్వరూపాన్ని, శక్తిని, భక్తుల పట్ల దేవి చూపించు కరుణని కళ్ళకి కట్టినట్లుగా చూపుతుంది ఈ స్తోత్రం. లలిత పంచకం అను నామముతో ప్రసిద్ధమైన ఈ పంచరత్న స్తోత్రాన్ని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు కృతం చేసారు.
ఈ స్తోత్రము లో శక్తివంతమైన దేవి నామములుసైతం ఇనుమడింప చేయబడ్డాయి. లలితా పరమేశ్వరి యొక్క కృప కొరకు భక్తులు అన్ని వేళల స్తుతించదగ్గ గొప్ప స్తోత్రం ఈ లలితా పంచరత్నం.
Sri Lalitha Pancharatnam lyrics with Meaning in Telugu – శ్రీ లలితా పంచరత్నం, లలిత పంచకం
ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథల మౌక్తిక శోభి నాసం
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాడ్యం
మందస్మితం మృగ మదోజ్వల ఫాలదేశమ్ (1)
లలితా దేవియొక్క ముఖపద్మమును ప్రాతః కాలము నందు ధ్యానించుచున్నాను
దొండపండు వంటి క్రింది పెదవితో, ముత్యపు ముక్కెరతో అలంకరించబడిన ముక్కు
చెవులదాక విస్తరించిన కన్నులు కలిగి, మణులు పొదిగిన చెవికుండలాలతో
చిరుమంద హాసంతో, నుదురుపై కస్తూరి మరియు ఇతర జంతు మదజలంతో చేయు తిలకం ధరించు దేవిని ధ్యానించుచున్నాను.
ప్రాతర్భజామి లలిత భుజ కల్పవల్లీమ్
రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాడ్యామ్
మాణిక్య హేమ వలయాంగద శోభమానం
పుండ్రేక్షుచాప కుసుమేషు స్రునీర్తధానామ్ (2)
ప్రాతః కాలమునందు నేను కల్పలతలు వంటి చేతులు కలిగిన లలిత దేవిని ధ్యానించుచున్నాను
మణులు కలిగిన ఉంగరములతో ఉన్న వ్రేళ్ళు ఆ కల్పలతకు చిగురుటాకులు వలే ఉన్నాయి
మాణిక్యములు పొదిగిన బంగారు కంకణములతో శోభాయమానంగా ఉన్న చేతులు కలిగి
చేతుల యందు చెరుకుతో చేసిన వింటిని, పుష్పబాణములును, అంకుశంను కలిగి ఉన్న ఓ దేవి నిన్ను ధ్యానించుచున్నాను
ప్రాతర్నమామి లలిత చరణార విందం
భక్తేష్ట దాన నిరతం భవ సింధు పోతమ్
పద్మాసనాది సురనాయక పూజనీయం
పద్మామ్-కుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యమ్ (3)
లలితా దేవి యొక్క పాదపద్మములకు నేను ప్రాతః కాలము నందు నమస్కరించుచున్నాను
ఏ పాదములు భక్తుల యొక్క కోర్కెలను నెరవేర్చుతాయో, సంసారసాగరమును దాటుటకు తెప్పయై ఉన్నవో
బ్రహ్మ (పద్మము నందు ఆసీనుడైనవాడు), సురులకు నాయకుడైన ఇంద్రునితోను పూజింపబడిన పాదపద్మములు కలిగి
పద్మము, అంకుశము, ధ్వజము,సుదర్శన చక్ర రేఖలతో ఉన్న దేవి పాదములను నేను నమస్కరించుచున్నాను
ప్రాతః స్తువే పరశివామ్ లలితాం భవానీం
త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యామ్
విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం
విద్యేశ్వరీం నిగమ వాఙ్మన సాతిదూరామ్ (4)
పరమేశ్వరుని పత్నిగా, భవానిగా పిలవబడు లలితా దేవిని ప్రాతః కాలమునందు స్తుతించుచున్నాను
ఎవరి వైభవాన్ని ఉపనిషత్తులు కొనియాడుచున్నవో, నిర్మలమగు కరుణ, దయా కలిగి
విశ్వము యెక్కు సృష్టి, స్థితి, లయమునకు కారణభూతురాలగు
సర్వ విద్యలకు అధిపతియై, వేదములకు కానీ, మనస్సుకు కానీ, వాక్కుకు కాని అందకఉండు ఓ దేవి నీకు నా నమస్కారములు
ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవ తేతి వచసా త్రిపురేశ్వరీతి (5)
ప్రాతః కాలము నందు లలితా దేవి యొక్క పుణ్య నామములు ఉచ్చరించుచున్నాను
కామేశ్వరిగా (కోరిన కోర్కెలు తీర్చు తల్లిగా), కమలా దేవిగా, మహేశ్వరిగా (మహేశ్వరుని భార్యగా)
శ్రీ శాంభవి దేవిగా (శంభు దేవుని భార్యగా), జగత్ జననిగ
వాగ్దేవి (వాక్కు యొక్క దేవిగా), త్రిపురేశ్వరి( త్రిపురారి అనగా శివునకు భార్యగా, త్రిపురములకు దేవిగా) ఉన్న ఓ దేవి నీకు నా వందనములు.
యః శ్లోక పంచకం మిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే
తస్మై దదాతి లలిత ఝటితి ప్రసన్న
విద్యం శ్రియం విమల సౌఖ్య మనంత కీర్తిమ్ (6)
లలితా దేవి యొక్క ఈ శ్లోకముల పంచకమును
ఎవరైతే ప్రభాతసమయమున అనగా ఉదయము నిద్రలేచు సమయమున పఠించురో వారికీ సౌభాగ్యము ప్రాప్తించును
వారి యందు లలితా దేవి శీఘ్రముగా ప్రసన్నురాలై
విద్యను , సిరిని, విమల సుఖమును అనంత కీర్తిని ప్రసాదించును
ఇతి శ్రీమత్ శంకర భగవత్ పాద కృతం లలిత పంచకం సంపూర్ణమ్
Leave a Comment