లక్ష్మి దేవి యొక్క ఎనిమిది రూపాలను స్తుతించే ఈ అష్టలక్ష్మి స్తోత్రం అష్టైశ్వర్యాలను ప్రసాదించే గొప్ప స్తోత్రముగా పెద్దలు చెబుతారు.
ఆదిలక్ష్మి, ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సంతాన, మరియు గజలక్ష్ముల రూపమును, గొప్పదనమునూ కీర్తిస్తుంటుంది ఈ అష్టలక్ష్మి స్తోత్రం.
రూపముతో పాటు లక్ష్మిదేవి గుణగణాలను, వైభవాన్ని తెలుసుకొని ధ్యానించుటకు ఈ స్తోత్రం ఎంతో ఉపయోగపడుతుంది.
అష్టలక్ష్మి రూపాలన్నింటిని ఒక స్తోత్రములోనే కీర్తించటం ఈ అష్టలక్ష్మి స్తోత్రం యొక్క విశేషము. లక్ష్మి కటాక్షము కొరకు తప్పక చదవవలసిన స్తోత్రం ఇది.
Sri Ashtalakshmi Stotram in Telugu – అష్టలక్ష్మి స్తోత్రం తెలుగులో
ఆదిలక్ష్మీ
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే
మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజ వాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ (1)
సజ్జనులకు వందనీయురాలవు, అందమైన రూపము ఉన్న దేవి, మాధవుని భార్యవు, చంద్రునికి సోదరివి, నిలువెల్లా బంగారమైన దానివి
మునిగణములచే పూజింపబడుచున్నావు, మోక్షమునిచ్చు దేవి, నీవు మధురముగా మాట్లాడుచున్నావు, వేదములచే స్తుతించబడుచున్నావు
తామరపువ్వుపై నివసించు ఓ దేవి, దేవతలు నిన్ను పూజించుచున్నారు, మంచి గుణములు ప్రసాదిస్తావు, శాంతమూర్తివి
నీకు జయము, మధుసూదనుని ప్రియురాలగు ఓ దేవి ఆదిలక్ష్మి నీవు సదా నన్ను రక్షింపుము.
ధాన్యలక్ష్మీ
అయి కలికల్మష నాశిని కామిని వైదికరూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజ వాసిని దేవగణాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ (2)
అమ్మ, నీవు కలి దోషములు పోగొట్టుదానవు, కాంక్షారూపిణివి, వైదిక మార్గమునకు రూపము, వేదములే నీవై ఉన్నదానవు
క్షీరసముద్రము నందు పుట్టిన మంగళ రూపిణివి, మంత్రం శక్తి యందు నివసించు దేవివి, మంత్రములే నీవై ఉన్నదానవు
శుభములు ప్రసాదిస్తావు, ప్రద్మము నందు నివసించు ఓ దేవి, నీ పాదములు దేవగణములు ఆశ్రయించి ఉన్నారు
నీకు జయము, మధుసూదనుని ప్రియురాలగు ఓ దేవి ధాన్యలక్ష్మి నీవు సదా నన్ను రక్షింపుము.
ధైర్యలక్ష్మీ
జయ వర వర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర-ఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయ హారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ (3)
దేవి నీకు నా నమస్కారములు, శ్రేష్టమైన వర్ణముతో శోభిల్లుచూ, విష్ణువుకు సంభందించిన దేవిగా, భృగు మహర్షి కుమార్తెగా, మంత్ర స్వరూపిణిగా, మంత్రమే తానుగా అయి ఉన్నావు
సుర గణములచే పూజింపబడు దేవి, సత్వరమే ఫలములు ప్రసాదించుచున్నావు, జ్ఞానమును వికసింపచేయు ఓ దేవి, శాస్త్రములు నిన్ను స్తుతించుచున్నాయి
జనన మరణ భయమును పోగొట్టి పాపములను తప్పించు దేవి, నీ పాదములను సాధు జనులు ఆశ్రయించు ఉన్నారు
నీకు జయము, మధుసూదనుని ప్రియురాలగు ఓ దేవి ధైర్యలక్ష్మి నీవు సదా నన్ను రక్షింపుము.
గజలక్ష్మీ
జయ జయ దుర్గతి-నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజ తురగ పదాది సమావృత పరిజనమండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారణ పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ (4)
దుర్గతులను తొలగించి, సకల శుభాలను ప్రసాదించి, శాస్త్రములే నీ రూపముగా ఉన్న దేవి నీకు జయము
రథములు, గజములు, గుర్రములు, పదాతులూ అను చతురంగ బాలలూ తన చుట్టూ పరివారముగా కలిగి, లోకమును రక్షించు దేవి
హరిహరులు, బ్రహ్మచే పూజింపబడుచూ సేవింపబడు దేవి, తాపమును నివారించు పాదములు కలిగిఉన్న దేవి
నీకు జయము, మధుసూదనుని ప్రియురాలగు ఓ దేవి గజలక్ష్మి నీవు సదా నన్ను రక్షింపుము.
సంతానలక్ష్మీ
అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణ వారిధి లోకహితైషిణి స్వరసప్త-భూషిత గాననుతే
సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి సదా పాలయ మామ్ (5)
అమ్మ, గరుడున్ని వాహనముగా కలిగి, కోర్కెలను తీర్చు తల్లిగా, చక్రమును ధరించి, అనురాగమును పెంచే జ్ఞానమూర్తివి
సుగుణముల సముద్రముగా నిండి ఉండి, లోకమునకు మంచిని చేయు దేవి, సప్తస్వరములతో కూడి ఉన్న కీర్తనలతో కీర్తింపబడుచూ
దేవతలు, రాక్షసులు, మునులు, ఋషులు, మరియు మానవులు అందరూ నీ పాదములకు నమస్కరించుచున్నారు
నీకు జయము, మధుసూదనుని ప్రియురాలగు ఓ దేవి సంతానలక్ష్మీ నీవు సదా నన్ను రక్షింపుము.
విజయలక్ష్మీ
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదినమర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే
జయ జయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ (6)
నీకు జయము దేవి, కమలమునందు ఉండుచూ, సద్గతులను ప్రసాదించి, జ్ఞానము వికసింపచేయు దేవి, నీవు సంగీత రూపిణివి
భక్తులచే అనుదినము అర్చించబడుచూ, కుంకుమ ఇత్యాది వాటితో అలంకరింపబడి, వివిధ వాయిద్యములతో స్తుతించబడు మాత
కనకధారా స్తోత్రము నందు శంకరాచార్యునితో నీవైభవమును వందనములతో స్తుతించబడినది
నీకు జయము, మధుసూదనుని ప్రియురాలగు ఓ దేవి విజయలక్ష్మీ నీవు సదా నన్ను రక్షింపుము.
విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి-దాయిని కలిమల-హారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ (7)
శచీ దేవి, సరస్వతి దేవతలచే పూజింపబడినావు, భృగు మహర్షి కూతురిగా భార్గవిగా జన్మించావు, భాధను, దుఃఖాన్ని నశింపచేయు దేవి, నీవు రత్నములతో నిండి ఉన్నావు
మణులతో నిండివున్న చెవి ఆభరణములు కలిగిఉన్న దేవి, శాంతిని కలిగించుచూ చిరున్నవ్వుతో ఉన్న ముఖము కలిగిఉన్నావు
నవనిధులు ఇచ్చి, కలి పాపములు తొలగించు దేవిగా, కోరిన కోర్కెలు తీర్చు వరదహస్తము కలిగి ఉన్న దేవి
నీకు జయము, మధుసూదనుని ప్రియురాలగు ఓ దేవి విద్యాలక్ష్మీ నీవు సదా నన్ను రక్షింపుము.
ధనలక్ష్మీ
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభినాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ (8)
ధిమి ధిమి ధింధిమి వంటి దుందుభి నాదములతో నిండివుండు ప్రదేశములలో ఉండుచూ
ఘుంఘుమ ఘుంఘుమని మ్రోగే శంఖ నాదములతో మంచి వాద్యములతో పూజించబడుచూ
వేదము, పురాణ, ఇతిహాసాదులచే పూజింపబడుచూ వైదిక మార్గము అనుసరించు భక్తులయందు ప్రసన్నురాలై ఉండు మాత
నీకు జయము, మధుసూదనుని ప్రియురాలగు ఓ దేవి ధనలక్ష్మీ నీవు సదా నన్ను రక్షింపుము.
ఇతి శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం సమాప్తమ్
Leave a Comment