లక్ష్మీ దేవి యొక్క వైభవ విశేషాలను వివరించే గొప్ప స్తోత్రాలలో మహాలక్ష్మీ అష్టకం ఒకటి. దేవతల రాజైన ఇంద్రునిచే రచింపబదినది ఈ శ్రీ మహాలక్ష్మీ అష్టకం.
నమస్తేస్తు మహాయమాయె అంటూ మొదలై లక్ష్మీ దేవి యొక్క రూపాన్ని, కీర్తిని, పరాక్రమాన్ని, మరియూ భక్తులపై చూపించు కరుణని వివరిస్తూ సాగుతుంది ఈ అష్టకం.
ధన ధాన్య వృద్ధి కొరకు మహాలక్ష్మీ పూజ చేసేవారు తప్పక పఠించవలసినది ఈ మహాలక్ష్మీ అష్టకం. విష్ణు దేవుని ఇల్లాలగు లక్ష్మీదేవికి సంభందించిన ఈ స్తోత్రం నిత్య పఠనం వళ్ళ లక్ష్మీ దేవి కృపకు పాత్రులై సర్వ పాపములు నశించి సుఖ-సంతోషాలతో, శుభాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగటంలో సందేహమేముంది.
లక్ష్మీపూజ చేసేవారు ఈ అష్టకంతోపాటు లక్ష్మీ అష్టోత్రం మరియూ అష్టలక్ష్మీ స్తోత్రం పఠించటం ఎంతో శుభప్రదం.
Mahalakshmi Ashtakam in Telugu for Praying Goddess Mahalakshmi- మహాలక్ష్మీ అష్టకం తెలుగులో
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే (1)
మహామాయా స్వరూపమైయున్న ఓ దేవీ నీకు నా నమస్కారము, శ్రీపీఠమున నెలకొనిఉండి, దేవతలచే పూజింపబడుచూ
శంఖము, చక్రము, గదా నీ యొక్క హస్తములతో పట్టుకొనియున్న మహాలక్ష్మీ దేవి నీకు నా నమస్కారము
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే (2)
గరుడున్నీ అధిరోహించి పయనించే దేవీ నీకు నా నమస్కారము, కోలాసురుడనే రాక్షసుణికి భయాన్ని కలిగించి సంహరించిన దేవీ
సర్వ పాపములు తొలగించే ఓ శ్రీ మహాలక్ష్మీ నీకు నా నమస్కారము
సర్వఙ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే (3)
సర్వమూ తెలిసి అన్ని వరములూ ప్రసాదించే ఓ దయామయి, అందరు దుష్టులకూ భయంకరిగా కనిపించే ఓ మాత
సకల దుఃఖములనూ తీసివేసే దేవి మహాలక్ష్మీ నీకు నా నమస్కారము
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే (4)
సిద్ధిని బుద్ధిని ప్రసాదించే దేవి నీవే భుక్తిని ముక్తిని ఇచ్చే దేవతవి
మంత్ర స్వరూపిణిగా ఎల్లపుడూ కొలువుండే దేవి మహాలక్ష్మీ నీకు నా నమస్కారము
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే (5)
ఆది అంతము లేని ఓ దేవి, నీవు ఆదిశక్తివి, మహేశ్వరివి
యోగుల మనస్సులందు కొలువుండుచూ, యోగము ద్వారా లభించుచున్న మహాలక్ష్మీ దేవి నీకు నా నమస్కారము
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే
మహా పాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే (6)
స్థూల సూక్ష్మ రూపములలోనూ, భీకరమగు మహా రౌద్ర రూపమున ఉండుచూ, మహా శక్తిగా, పెద్దదైన పొట్టకలిగి (ప్రపంచాన్ని జన్మనిచ్చిన తల్లి సూచికగా)
మహా పాపములను సైతం తొలగించే మహాలక్ష్మీ దేవి నీకు నా నమస్కారము
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి
పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే (7)
పద్మాసనములో కూర్చొని ఉండే దేవి, నీవు పరబ్రహ్మ స్వరూపిణివి
పరమేశిగా జగన్మాతగా ఉన్న మహాలక్ష్మీ దేవి నీకు నా నమస్కారము
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే (8)
తెల్లని వస్త్రములు ధరించి అనేక రకముల అలంకారములతో శోభుల్లుచున్న దేవి
జగత్తు అంతటనూ కొలువైయున్న జగన్మాత ఓ మహాలక్ష్మీ దేవి నీకు నా నమస్కారము
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా
మహాలక్ష్మీ అష్టకం అగు ఈ స్తోత్రం భక్తితో పఠించు మానవులకు
సకల సిద్ధులూ కలుగును, రాజ్యము (రాజ్యాధికారం, రాజ భోగము) ఎల్లపుడూ ప్రాప్తించును
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః
నిత్యమూ ఒకమారు పఠించినచో మహాపాపములు నశిస్తాయి
ప్రతి నిత్యమూ రెండుమార్లు పఠించినచో ధన ధాన్యములు ప్రాప్తించును
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా
ఈ స్తోత్రమును నిత్యమూ మూడుమార్లు పాటించినచో ఎంతటి శత్రువులైన నాశనమగుదురు
మహాలక్ష్మీ దేవిని నిత్యము పూజించినచో దేవి ప్రసన్నురాలై వరములనిచ్చి శుభమును చేకూర్చును
ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్
ఇంద్రునిచే రచింపబడ్డ మహాలక్ష్మీ అష్టకం అను స్తోత్రము సంపూర్ణము.
Leave a Comment