వేదవ్యాసుడు రచించిన ఈ నవగ్రహ స్తోత్రం పఠించుట వలన గ్రహ దోషాల నుండి మనల్ని రక్షించటమే కాక నవగ్రహాది పతులు మనపై అనుగ్రహం చూపేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
మనం మొదలుపెట్టే పనులకు సంకల్పంతోపాటు నవగ్రహాల అనుగ్రహం కూడా తోడైతే విజయం మనవెంటఉన్నట్లే. అందుకోసం తప్పనిసరిగా నిత్యము పఠించదగ్గది ఈ నవగ్రహ స్తోత్రం.
ఈ స్తోత్రములో ఫలస్తుతి కాకుండా తొమ్మిది శ్లోకాలున్నాయి ఒక్కోశ్లోకం ఒక్కో గ్రహానికి సంబందించినది. ఆ శ్లోకములలో ముఖ్యముగా ఆ దేవుని గురించిన వివరణ ఉంటుంది.
గ్రహ స్థితి బాగులేనివారు, కాలము కలసిరాని వారు, నవగ్రహ స్తోత్ర పఠనంతోపాటు నవగ్రహాలకు అధిపతియైన శివుని స్తోత్రములు పఠించటం ఉత్తమం.
Navagraha Stotram in Telugu- నవగ్రహ స్తోత్రం
రవి
జపా-కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ (1)
మందార పువ్వు (జపా కుసుమం) రంగుతో శోభిల్లుచున్న, కశ్యప వంశములో జన్మించి, గొప్ప కాంతితో వెలుగొందుచూ
సర్వ పాపములను పోగొట్టువాడు అయిఉండి, దివాకర నామముతో పిలవబడుచున్న సూర్య భగవానునికి నమస్కరించుచున్నాను
చంద్ర
దధి శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం
నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణమ్ (2)
పెరుగు, శంఖము, మంచుతో సమానమైన తెల్లని రంగు కలిగి, పాల సముద్రము నుండి పుట్టినవాడు (క్షీరసాగర మధనము నుండి)
శంభు దేవుని (శివుని) కిరీటము నందు అలంకార ఆభరణముగా ఉండుచూ, కుందేలు వంటి గుర్తు తనపై కలిగిన చంద్రునకు నా నమస్కారములు
కుజ
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహమ్ (3)
భూమికి జన్మించినవాడు, మెరుపు వంటి కాంతితో ప్రకాశించువాడు
భూమి యొక్క కుమారుడు, హస్తము నందు శక్తిని కలవాడు అయినటువంటి మంగళ (అంగారక) నామముతో పిలువబడు కుజునకు నా ప్రణామములు.
బుధ
ప్రియంగు కలికా-శ్యామం రూపేణా ప్రతిమం బుధమ్
సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ (4)
కదంబ వృక్షపు మొగ్గకి ఉండు లేత ఆకుపచ్చని రంగు కలిగిఉండి, ఆకారములో ఎవరితోనూ సాటిలేనటువంటివాడై
సౌమ్యుడు, సౌమ్య గుణములతో ఉండువాడు అయినటువంటి బుధునికి నా నమస్కారములు
గురు
దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభమ్
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ (5)
దేవతలకి, ఋషులకి గురువైనటువంటివాడు, బంగారు వర్ణముతో ప్రకాశించువాడై
బుద్ధిమంతుడు, తెలివైనవాడు, మూడు లోకాలకు గురువు అయినటువంటి బృహస్పతి (గురువునకు) నా నమస్కారములు.
శుక్ర
హిమకుంద మృణాళాభం దైత్యానామ్ పరమం గురుమ్
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ (6)
మంచు, మల్లెపువ్వులు, తామర తూడులతో పోలిక కలిగినవాడు, దైత్యులకు (అసురులకు) పరమ గురువు
సర్వ శాస్త్రాలపై మాట్లాడగల సమర్ధుడు, భార్గవుడగు శుక్రునకు నా ప్రణామములు
శని
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ (7)
నల్లని కాటుక వంటి రంగుతో ఉండువాడు, సూర్యుని పుత్రుడు, యమునకు సోదరుడు
ఛాయా దేవి, మార్తాండ సూర్యునికి జన్మించినటువంటి శనైశ్చరునకు నేను నమస్కరించుచున్నాను
రాహు
అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనమ్
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ (8)
సొగము శరీరము కలవాడు, మహా వీరుడు, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి పట్టి విడుచువాడు
హిరణ్య కశిపుని సోదరి అగు సింహిక గర్భమున జన్మించినవాడగు రాహువునకు నా ప్రణామములు.
కేతు
పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకమ్
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ (9)
మోదుగ పువ్వు వంటి రంగుతో ప్రకాశించుచూ, నక్షత్రములు మరియూ గ్రహములకు శిరస్సువలే ఉండుచూ
భయము కలిగించునదిగా (పాపులకు), రౌద్ర స్వరూపముతో, ఘోరముగా కనపడుచున్న(తప్పులు చేయువారికి) కేతువునకు నా వందనములు.
ఫలశ్రుతి
ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్ సుసమాహితః
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్ భవిష్యతి
వ్యాసునిచే వ్రాయబడిన ఈ గీతమును పఠించుట వలన వారు శక్తివంతులై రాజ్యాధికారము పొందుతారు
అట్టివారు పగలూ లేక రాత్రులు వచ్చు ఆపదల నుండి రక్షింపబడతారు
నరనారీ నృపాణాం చ భవేద్ దుఃస్వప్న నాశనమ్
ఐశ్వర్య మతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్
మగవారు, స్త్రీలు, లేక రాజులు ఎవరైనా ఈ నవగ్రహ స్త్రోత్రము పఠించుట వలన వారికి వచ్చు చెడు కలలు నశిస్తాయి
వారికి అంతులేని ఐశ్వర్యము, మంచి ఆరోగ్యముతో, మంచిగా వెలుగొందుతారు
గ్రహ నక్షత్రజాః పీడాహ్ తస్కరాగ్ని సముద్భవాః
తహ సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః
గ్రహ, నక్షత్ర పీడల నుండి, దొంగలూ, అగ్ని వల్ల కలుగు భయాల నుండి కాపాడబడుతారు
వ్యాసుడు చెప్పిన ఈ మాటలపై సంశయము వలదు.
ఇతి శ్రీ వేద వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్
Leave a Comment