మనస్సు ద్వారా కైలాశాధిపతి అగు శివుణ్ణి ఆరాధించటమే శివ మానస పూజ.
జగద్గురు శంకరాచార్యులచే కృతమగు ఈ మానస పూజ స్తోత్రం యొక్క పరమోద్దేశం ఏమిటంటే భౌతికంగా వస్తువులు ఉన్నా లేకపోయినా, మన స్థితిగతులను మరచి, మనస్సు అనే సాధనము ద్వారా శివుణ్ణి ఆరాధించటమే.
ఈ శివ మానస పూజ స్తోత్రములో పరమేశ్వరున్ని మనస్సు ద్వారా అనేక ఉపచారములతో పూజించి, వాటిని స్వీకరించమని ప్రార్థిస్తాము. అంతేకాక మనము చేసే ప్రతి పనిని పూజగా భావించి స్వీకరించమని అడుగుతాము.
నిండైన భక్తితో మనస్సు ద్వారా చేసే ఓ గొప్ప పూజ ఇది. శివ భక్తులు తప్పక పఠించతగ్గ స్తోత్రం.
Sri Shiva Manasa Puja Telugu- శివ మానస పూజ తెలుగులో
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్
జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ (1)
శివా, రత్నములతో అలంకరించబడిన సింహాసనాన్ని, స్నానమునకు చల్లని నీటిని, దివ్యమైన వస్త్రములను
వివిధ రత్నములు పొదగబడిన ఆభరణాలను, మృగముల నుంచి వచ్చు సుగంధభరితమైన కస్తూరిని, గంధమును
శ్రేష్ఠమైన జాజి, చంపక పుష్పాలను, బిల్వ పాత్రలను, ధూపమును
దీపమును నా మనస్సు ద్వారా సమర్పించుచున్నాను. ఓ దేవా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఓ దయానిధి, పశుపతి, దయచేసి నా మానస పూజను స్వీకరించుము.
సౌవర్ణే నవరత్న ఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు (2)
నవరత్నములతో పొదగబడిన బంగారు పాత్రలలో నెయ్యిని, పాయసాన్ని,
ఐదు రకముల భక్ష్యములను( భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, పానీయములను), పాలు, పెరుగు, అరటిపండు, పానకమును
వివిధరకాల కూరలను, పచ్చకర్పూరం ఉంచబడిన రుచికరమైన జలమును
తాంబూలమును మనస్సు ద్వారా నిండైన భక్తితో సమర్పించుచున్నాను, ముల్లోకములకు ప్రభువైన పరమేశ్వరా స్వీకరించుము.
ఛత్రం చామర యోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలా గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్ బహువిధా హ్యేతత్ సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో (3)
శివా, నేను మీకు ఛత్రమును (గొడుగు), చామరమును (వింజామర), నిర్మలమగు మాలినము లేనటువంటి అద్దమును
వీణాభేరి, మృదంగము, ఢమరుక నాదములతో, గానము, నృత్యముతో,
సాష్టాంగ నమస్కారంతో, స్తుతులతో పరిపరి విధాలుగా, ఇత్యాది సమస్తమూ నా మనస్సులో
సంకల్పించి సమర్పించుచున్నట్లుగా భావించి పూజ చేయుచున్నాను, ప్రభూ, స్వీకరించుము.
ఆత్మాత్వం గిరిజా మతిః సహచరాః ప్రాణా శరీరం గృహం
పూజా తే విషయోప భోగరచనా నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ (4)
శివా, నీవు నా ఆత్మవు, గిరిజా దేవి అగు పార్వతి మాత నా బుద్ధి, నా పంచ ప్రాణములు నీ సహచరులు, నా శరీరమే నీ ఇల్లు
నా అనుభూతులే నీ పూజలు, నా నిద్రయే సమాధిస్థితి
నా సంచారమే నీకు చేయు ప్రదక్షిణలు, నేను పలుకు మాటలు నీ స్తోత్రములు
నేను ఏ పనులు చేసిననూ మీ పూజగా భావించి చేసే ఆరాధనగా స్వీకరించండి శంభు దేవా
కరచరణ కృతం వా క్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్
విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో (5)
నా కరములతో, చరణములతో (చేతులు, కాళ్ళుతో), వాక్కు లేదా శరీరంతో
చెవులు కన్నుల ద్వారా, లేదా మనస్సు బుద్ధితో చేసిన తప్పులను
తెలిసీ తెలియక చేసిన చేసిన అపరాధములను అన్నింటిని క్షమించుము అని
కరుణా సముద్రుడవైన ఓ మహా దేవా నిన్ను నా మది యందు వేడుకొంటున్నాను. శంభు దేవా నీకు జయము జయము.
ఇతి శ్రీమద్ శంకరాచార్య కృతం శివ మానస పూజ స్తోత్రం
మహా దేవుని సత్వర కృప కొరకు తప్పక పఠించతగ్గ ఇతర స్తోత్రములు శివ పంచాక్షర స్తోత్రం, లింగాష్టకం, మరియు చంద్రశేఖర అష్టకం.
Leave a Comment