Ganesha Stotras గణేశ స్తోత్రాలు Stotras-స్తోత్రాలు

Ganesha Pancharatnam in Telugu- శ్రీ గణేశ పంచరత్నం

తొలి పూజలందుకొను గణేశుని స్తుతించు స్తోత్రాలలో గణేశ పంచరత్నం ఒక ప్రత్యేకమైన స్తోత్రం. గణేశుని స్వరూపం, భక్తుల పట్ల చూపు కరుణని, దీనార్తులను దెగ్గరకు తీసుకోను స్వభావాన్ని, లోకహితం కొరకు వినాయకుడు చేయు ఉపకారాన్ని ఈ గణేశ పంచరత్నం చక్కగా వివరిస్తుంది.

ఈ స్తోత్రం మొత్తం ఐదు భాగాలుగా ఉంటుంది. ఒక్కో భాగాన్ని ఒక రత్నముగా భావించి భగవంతుణ్ణి స్తుతించటం వల్ల  పంచరత్న స్తోత్రంగా పిలవబడుతుంది.

గణేశ పంచరత్న స్తోత్రాన్ని ప్రతిరోజూ పఠించు వారి యందు గణపతి ప్రసన్నుడై అష్టైశ్వర్యాలను, ఆరోగ్యమును, విద్యని, గొప్ప జీవితమును ప్రసాదించునని ఈ స్తోత్ర ఫలస్తుతి వివరిస్తుంది.

Ganesha Pancharatnam in Telugu

శ్రీ గణేశ పంచరత్నం- Ganesha Pancharatnam Lyrics in Telugu with Meaning

ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్
నతాశుభాశు నాశకం నమామితం వినాయకం (1)

సంతోషముతో హస్తమందు మోదకమును పట్టుకున్నవాడు, సాధకులకు ఎల్లప్పుడూ మోక్షమును ఇచ్చువాడు
చంద్రుడిని ఆభరణముగా శిరస్సు యందు ధరించువాడు, లోకములను రక్షించువాడు
సర్వలోకములకు ప్రభువుగా, తనపై మరొక ప్రభువు లేనటువంటివానిగా, దైత్యులను వినాశనము చేయువానిగా
శ్రీఘ్రముగా అశుభములను నాశనము చేయు వినాయకునికి నా నమస్కారములు

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాప దుర్ధరమ్
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ (2)

దుర్భుద్ధితో, కుయుక్తితో ఉండు వారి యందు భయంకరునిగా కనబడుచు, ఉదయించు సూర్యుని వలె ప్రకాశించువానిగా
సమస్కరించు సురులను ఇతర భక్తులను కలిగిఉన్నవాడు, ఆపదలునుండి తన భక్తులను రక్షించువాడు
సురులకు అధిపతిగా ఉన్నవాడా, నిధులకి అధిపతిగా, గజముఖునిగా, గణాలకు అధిపతిగా ఉండువాడా
మహేశ్వర స్వరూపముగా భాసిల్లు ఆ వినాయకునిని నిరంతరము ఆశ్రయించి ఉంటాను.

సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్
మనస్కరమ్ నమస్కృతామ్ నమస్కరోమి భాస్వరమ్ (3)

సమస్త లోకములకు శుభమును కలుగచేయువానిగా, శరణాగతి కోరిన శ్రేష్ఠులగు దైత్యులను కలవాడిగా
గొప్ప బొజ్జ కలవాడు, వరములను ఇచ్చువాడు, గజముఖముతో విరాజిల్లుచూ
భక్తుల యందు కృపాకరునిగా, తప్పులను క్షమతో వదిలివేయువాడిగా, సంతోషమునకు నిలయమగా, కీర్తిని కలిగించి
చక్కని మనస్సును ప్రసాదించున్న, ప్రకాశమానుడగు ఆ వినాయకునికి నేను నమస్కరించుచున్నాను

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ (4)

దీనార్తుల బాధలను తొలగించువాడు, ప్రాచీన దివ్య వాక్కులయందు నిలయమై ఉండువాడు
పురములకు అధిపతి అగు పురారి (పరమేశ్వరునికి) పెద్ద కుమారునిగా, సురుల వైరి పక్షము వారి గర్వమును అణచినవాడిగా
ప్రళయ కాల సృష్టి నాశనము నందు భయంకరమగా ఉండువాడు, అగ్ని మొదలగు దేవతలు భూషణముగా కలవాడు
గండ స్థలమందు కరుచున్న మద జలము కలిగియుండి పురాణ కాలమునుండి పూజలందుకొంటున్న ఆ వినాయకునికి నా నమస్కారములు

నితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజమ్
అచింత్య రూపమంతహీన మంతరాయ కృంతనమ్
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్
తమేకదంత మేవతం విచింతయామి సంతతమ్ (5)

శోభాయమానంగా ప్రకాశించు శరీరము, కాంతివంతమగు దంతముతో ఉండి, పరమేశ్వరునికి పుత్రునిగా
వివరించుటకు అందని రూపము కలిగి, నాశరహితునిగా, విఘ్నములు తొలగించువానిగా
ఎల్లప్పుడూ యోగుల హృదయము నందు నివసించు వానిగా
విఘ్నములు భేదించువానిగా ఉండి, ఏకదంతము కలిగిఉన్న ఆ వినాయకునికి నమస్కరించుచున్నాను

మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహమ్
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్
ఆరోగతామదోషతాం సుసాహితీమ్ సుపుత్రతామ్
సమాహితాయు రాస్తభూతి మభ్యుపైతి సోచిరాత్

ఈ మహా గణేశ పంచరత్నమును ఎవరైతే భక్తితో నిత్యము పఠించుచు
ఉదయమున గణేశునుని మనస్సు యందు స్మరిస్తారో
వారికి చక్కటి ఆరోగ్యము, దోషము లేని జీవితము, గొప్ప విద్య, మంచి పిల్లలును,
పూర్ణ ఆయువుతో అష్టైశ్వర్యములను శ్రీఘ్రముగా పొందును.

About the author

Stotra Manjari Team

Leave a Comment